ఆన్‌లైన్‌లో చిన్నచిన్న గేమ్‌లు ఆడటం ద్వారా నిమిషాల్లో లక్షల రూపాయలు సంపాదించొచ్చని చెప్తూ కొందరు షేర్ చేస్తున్న వీడియోలపై టీఎస్ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) ఘాటుగా స్పందించారు. ఇటువంటి బెట్టింగ్ కూపంలో పడొద్దని యువతను కోరారాయన. అరచేతిలో వైకుంఠం చూపి బ్యాంకులు ఖాళీ చేయడమంటే ఇదేనేమో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారాయన. ఇటువంటి ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు. ఎవరైనా మనకు ఒక్క రూపాయి అయినా ఫ్రీగా, మరీ అంత సులభంగా ఎందుకు ఇస్తారో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలని ఆయన తెలిపారు.
ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ వీడియోలు చేస్తున్న వారంతా కూడా సంఘవిద్రోహ శక్తులేంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వారిని ఫ్రీ మనీ అంటూ బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
‘‘అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు..!! ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి(Betting Trap) లాగుతున్నారు. తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యసనపరులను చేస్తూ.. వారి ప్రాణాలను తీస్తోన్న వీళ్లంతా సంఘవిద్రోహ శక్తులే. యువకుల్లారా!! ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మాయమాటల్లో పడకండి!! బంగారు జీవితాలను నాశనం చేసుకోకండి. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు. మీ కష్టాన్ని నమ్ముకోండి. విజయం దానంతట అదే మీ దరికి చేరుతుంది’’ అని ఆయన పోస్ట్ పెట్టారు సజ్జనార్(Sajjanar).