బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో స్టేషన్ ఘున్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) వెక్కి వెక్కి ఏడ్చారు. క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన రాజయ్య.. ప్రాంగంణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు పడుకుని భోరున విలపించారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నతస్థానం కల్పిస్తామని కేసీఆర్(KCR) తనకు చెప్పారని అధినేత మాటను గౌరవించి ముందుకు సాగుతానని తెలిపారు. ముఖ్యంగా వరుస వివాదాలు ఆయనకు అవకాశాలను దెబ్బతీశాయి.
జానకీపురం సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణల వ్యవహారం రాజయ్యకు బాగా మైనస్ అయింది. ఓవైపు నవ్య ఎపిసోడ్ రచ్చ.. మరోవైపు కడియం శ్రీహరి(Kadiyam Srihari)తో విభేదాలను అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. దీంతో రాజయ్యను పక్కన పెట్టిన కేసీఆర్.. కడియం శ్రీహరికి టికెట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు రెండు రోజుల క్రితం టికెట్ రావాలని రాజశ్యామల యోగం కూడా చేశారు తాటికొండ. అయినా ఫలితం లేకుండా పోయింది.
మరోవైపు ఆయన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు. కాగా 2014లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య(Thatikonda Rajaiah)కు కేసీఆర్ ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఆరోగ్యశాఖ మంత్రి శాఖ కేటాయించారు. అయితే అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఆయనను ఆ పదవుల నుంచి కేసీఆర్ తీసివేశారు. 2018లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.