మహాత్మా గాంధీ బోధించిన శాంతి-అహింసా సిద్ధాంతం, లాల్ బహుదూర్ శాస్త్రి బోధించిన జై జవాన్-జై కిసాన్ ప్రస్తుతం దేశంలో నలిగిపోతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని కేసీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ధ్యానమూర్తిలో ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించటం గొప్ప విషయమని అన్నారు. గాంధీ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చిరస్థాయి కీర్తి దక్కుతుందని అన్నారు. కరోనా విపత్తు వేళ గాంధీ ఆసుపత్రి అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ధైర్యంగా పనిచేసిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావును కేసీఆర్ అభినందించారు. గాంధీ జన్మించిన దేశంలో పుట్టడం మనందరం చేసుకున్న పుణ్యమని అన్నారు. గాంధీ సూచించిన అహింస, శాంతి, ధర్మం, సేవ, త్యాగనిరతి సిద్ధాంతాలు విశ్వజనీనం అని అన్నారు. గాంధీ అహింసా సిద్ధాంతోనే బ్రిటీషర్లపై పోరాడి, దేశానికి స్వాతంత్ర్యం సాధించారని కేసీఆర్ వివరించారు.