తమ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో ఎటువంటి తప్పు ఉన్నా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన కుల గణన(Caste Census) పక్కాగా ఒరిజినల్ లెక్కలతో ఉందని, బీఆర్ఎస్ తరహాలో తాము తప్పుడు లెక్కలు చూపలేదని విమర్శలు చేశారు. ప్రజలు చెప్పిన వివరాలే రికార్డుల్లో నమోదయ్యాయని, ఒక్కో ఎన్యుమరేటర్‌కి 150 ఇళ్లు మాత్రమే కేటాయించామని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పిన మేరకే కులగణన సహా అన్నీ చేస్తున్నాను అని తెలిపారు.
‘‘కేసీఆర్(KCR) సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలు మాత్రమే చూపారు. అందులో ‘బీసీ’లు 51% శాతం, ‘ఎస్సీ’లు 18%, ‘ఎస్టీ’లు 10% శాతం, మిగతావాళ్ళు ‘ఓసీ’లుగా చూపారు. మా సర్వేలో మొత్తం 5 కేటగిరీలుగా విభజించి, ముస్లింలలో ఉన్న బీసీలను కూడా కలిపి చెప్పాము. ఆ ప్రకారం హిందూ, ముస్లిం బీసీలంతా కలిసి 56% అయ్యారు. 42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి, పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం. రాజకీయ జోక్యానికి తావులేకుండా కమిషన్ ద్వారానే ప్రాసెస్ చేస్తున్నాం. కేసీఆర్ సర్వేలో ఎస్సీలు 82 కులాలుగా చూపారు. కానీ ఉన్నవి 59 కులాలే. స్పెల్లింగ్ తప్పుగా ఎంట్రీ అయినా దాన్ని మరో కులంగా చూపారు. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసిన నేను(Revanth Reddy) పట్టించుకోను’’ అని తెలిపారు.