ఖమ్మం జిల్లా సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఖమ్మం జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నాను కానీ, జిల్లా ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన జీవితాంతం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. తన రాజకీయ పదవి తన కోసం కాదని.. ఖమ్మం జిల్లా కోసమని తెలిపారు. నాగలి దున్నుకునే తనను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశారని.. మూడు ప్రభుత్వాలలో తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తనకు కష్టం వచ్చినప్పుడు తనను కాపాడారన్నారు తుమ్మల.
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల అనంతరం తొలిసారి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఈ సమావేశానికి తరలి వచ్చారు. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో తుమ్మల ఖమ్మం చేరుకున్నారు. అయితే ఈ ర్యాలీలో కేసీఆర్, కేటీఆర్‌ల ఫొటోలు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలు కన్పించడంతో ఆయన కాంగ్రెస్ వైపే ముగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఇటీవల గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్‌లో తుమ్మల నాగేశ్వరరావు పేరులేదు. తుమ్మలకు బదులు పాలేరు అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ఈ స్థానం నుండి కచ్చింగా పోటీ చేయాలని భావించిన తుమ్మల నాగేశ్వరరావు.. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయనను బుజ్జగించడానికి ఎంపీ నామా నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తానన్న తుమ్మల తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.