తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు(TOA Elections) ఈరోజు ముగిశాయి. ఎల్‌బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్ వేదికగా ఈ ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఉదయం మొదలైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఇందులో అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి(AP Jithender Reddy), రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్(Chamundeswaranath) పోటీపడ్డారు. ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా మిగిలిన స్థానాలకు సభ్యుల ఎన్నిక లాంఛనప్రాయం కానుంది.
ప్రధాన కార్యదర్శి పదవి కోసం బాబురావు, మల్లారెడ్డి పోటీపడుతున్నారు. కోశాధికారి పదవి కోసం సతీష్ గౌడ్, ప్రదీప్ కుమార్ తలపడుతున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధ్యక్ష పీఠం దక్కించుకోవాలని చాముండేశ్వర్‌నాథ్, జితేందర్ రెడ్డిల వర్గాలు ఆఖరి క్షణం వరకు కూడా ప్రయత్నించాయి. మొత్తం 68 మంది సభ్యులు ఉండగా. ఓటింగ్ ముగిసే సమయానికి 59 ఓట్లు పోల్ అయ్యాయి. కాగా ఫలితాలు ఇంకా వెల్లడించలేదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో టీఓఏ ఎన్నికల(TOA Elections) ఫలితాల విడుదలను వాయిదా వేశారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ ఫలితాలను వెల్లడించనున్నట్లు సమాచారం.