రాజకీయాల్లో రాణించాలంటే ఒంటెద్దు పోకడ ఏమాత్రం పనికిరాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. సమయానుకూలంగా సమన్వయంతో నడుచుకుంటేనే రాజకీయాల్లో ముందడుగు వేయగలుగుతామని వివరించారు. మహేశ్వరం గట్టుపల్లిలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్(Youth Congress) ట్రైనింగ్ క్యాంప్‌ను మహేష్ కుమార్.. ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం దొరకడం ఒక అదృష్టమన్నారు. పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎంత మంది ఉన్నా.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.
‘‘క్రమశిక్షణ గల కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు వరిస్తాయి. టీపీసీసీ అధ్యక్షుడి(TPCC Chief)గా నేను ఉదాహరణగా చెబుతున్నా.. రాజకీయాల్లో కాంప్రమైజ్ కంపల్సరీ.. పరిస్థితులకు తగ్గట్టుగా సమయానుసారం నడుచుకోవాలి. వెనక్కి తిరిగి చూడకుండా నిరంతరం కష్టపడాలి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నా సలహా. కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా యూత్ కాంగ్రెస్ పనిచేయాలి. కష్టపడి పనిచేసిన యూత్ కాంగ్రెస్ నేతలకు రానున్న ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తాం’’ అని Mahesh Kumar Goud అన్నారు.