తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌ను నియమించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మున్షి పనితీరు నచ్చకనే ఏఐసీసీ(AICC) ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని అందుకే ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకందని పలు అభిప్రాయ పడుతున్నారు. ఈ ప్రచారాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. ఈ ప్రచారాల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. మున్షీపై చర్యల రూపంలో కొత్త ఇన్‌ఛార్జ్‌ను నియమించలేదని స్పష్టం చేశారు.
దీపాదాస్ మున్షి నిబద్దత, క్రమశిక్షణ ఉన్న నాయకురాలన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్‌గా పని చేసిన దీపాదాస్ మున్షి నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకురాలు. ఆమె పార్టీని బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారు. దీపాదాస్ మున్షి.. పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేశారని ప్రచారం చేస్తున్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదు’’ అని అన్నారు.
‘‘దీపాదాస్ మున్షి.. కేరళ ఏఐసీసీ ఇంచార్జ్ గా ఉంటూ తెలంగాణ లో ఏడాది కాలం పాటు అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఏఐసీసీ కొన్ని రాష్ట్రాల ఇంచార్జ్‌లను, సంస్థాగత మార్పులను చేస్తూ అందులో భాగంగా తెలంగాణకు పూర్తి బాధ్యతలతో మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)ను నియమించారు. కాంగ్రెస్ పార్టీకి కేరళలో పూర్తి బాధ్యతలతో పనిచేయాల్సి ఉన్నందున ఇక్కడ కొత్త నియామకం జరిగిందే తప్ప ఎలాంటి చర్యలు కావు.
దీపాదాస్ మున్షి(Deepa Das Munshi).. ప్రియరంజన్ దాస్ మున్షి సతిమణిగా, పెద్ద రాజకీయ కుటుంబ నేపథ్యం, నీతి, నిజాయితీగా పని చేసిన చరిత్ర ఉంది. పార్టీని క్రమశిక్షణగా, సంస్థాగతంగా బలోపేతం చేసారు. ఆమెపై వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి నిరాధార ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడుతాం’’ అని Mahesh Kumar Goud హెచ్చరించారు.