Panthangi Toll Plaza | సంక్రాంతి పండుగకు నగరవాసులు పల్లెబాట పట్టారు. బంధువుల మధ్య పెద్ద పండుగను ఘనంగా జరుపుకునేందుకు పయనమయ్యారు. సొంత వాహనాలు ఉన్న వారు కార్లలో రయ్ రయ్ అంటూ దూసుకపోతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఫుల్ ట్రాఫిక్ నెలకొంది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అదనపు టోల్ బూత్‌లు ఏర్పాటుచేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రానున్న రెండు రోజులు మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశాలు ఉండటంతో వాహదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
మరోవైపు బస్టాండ్‌లు, రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. తెలంగాణ నుంచి 4,484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ సైతం హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం 6,725 బస్సులను నడుపుతున్న అధికారలు తెలిపారు.