నగరవాసులకు రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Diversions) విధించారు. సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నేడు, రేపు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులతో ఆలయాల సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని వివరించారు.
ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లించనున్నారు(Traffic Diversions). సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే వారు త్వరగా ఇళ్ల నుంచి బయలుదేరాలని సూచించారు. అదే విధంగా ప్లాట్ ఫామ్ నెంబర్.1 నుంచి వెళ్లే వారు రద్దీ ఎక్కువ ఉండడంతో చిలకలగూడ వైపు నుంచి వచ్చి ప్లాట్ ఫామ్ నంబర్.10ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆలయానికి రెండు కిలో మీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.