TRS Ex MP Boora Narsaiah Goud: జాతీయ పార్టీ పెట్టి బీజేపీను గద్దె దించే దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రణాళికలు వేస్తుండగా.. సొంత పార్టీ నుంచే కేసీఆర్‌కు పెద్ద షాక్ తగలింది. అది కూడా మునుగోడు ఉప ఎన్నికల వేళ ఇది కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. మునుగోడు టికెట్ ఆశించి, భంగపడిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నారు. ఢిల్లీ వెళ్లిన బూర నర్సయ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో బూర నర్సయ్య గౌడ్ (TRS Ex MP Boora Narsaiah Goud) బీజేపీలోకి చేరటం ఖాయమైనట్లే కనిపిస్తోంది. అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమకారుడిగా, బలమైన బీసీ సమాజిక వర్గ నేతగా, వృత్తిరీత్యా వైద్యుడిగా బూర నర్సయ్య గౌడ్‌కు ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014లో భువనగిరి నియోజకవర్గం నుంచి బూర నర్సయ్య పోటీ చేసి గెలిపొందారు. 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పోటీ పొడి, ఓటమి పాలయ్యారు. ఎంపీగా ఓడినప్పటి నుంచి జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి తనను దూరం పెడుతున్నారని బూర నర్సయ్య పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మునుగోడు టికెట్ ఆశిస్తున్న తనను కేసీఆర్ కనీసం పిలిచి మాట్లాడలేదని తన అనుచరుల వద్ద గోడును వెళ్లబోసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆత్మగౌరవం కోసమే, బూర పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు.
మునుగోడులో 60 శాతం బీసీ వర్గానికి చెందిన వారే ఉండటం.. టీఆర్‌ఎస్‌ను బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత వీడటంతో మంత్రి జగదీష్ రెడ్డి అప్రమత్తమయ్యారు. బూర నర్సయ్య గౌడ్ (TRS Ex MP Boora Narsaiah Goud) పార్టీ మార్పు ప్రభావం మునుగోడు ఎలక్షన్‌పై పడకూడదని.. గౌడ సమాజిక వర్గానికి చెందిన నేతలను బుజ్జగించే పనులో పడ్డారు. బూరతో సాన్నిహిత్యం ఉన్న ప్రజాప్రతినిధులతో టీఆర్‌ఎస్ నేతలంతా సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈటల వంటి వారు టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలోకి చేరటం, కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లటం.. తాజాగా బూర నర్సయ్య గౌడ్ వంటి బీసీ వర్గానికి చెందిన బలమైన వ్యక్తి కాషాయ దళంలోకి చేరటం వంటివి చూస్తుంటే.. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని చెప్పవచ్చు.
Read also:GSLV-3: మైలురాయి ప్రయోగానికి సర్వం సిద్ధం