TS Budget 2023: తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మధ్య మొదలైన వార్ ముగిసినట్లు అర్ధమవుతోంది. తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేయడమే దీనికి నిదర్శనం. కాగా తమిళిసై తెలంగాణ బడ్జెట్ సమర్పణ పత్రాలపై మంగళవారం సంతకం చేశారు. దీంతో ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మూడో తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే ఛాన్స్ ఉంది. రెండు రోజుల విరామం తర్వాత 6న సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అంతకు ముందు సోమవారం రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య వైరం హైకోర్టు వరకు వెళ్లింది. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై వాదనల క్రమంలో ఇరు పక్షాలు రాజీ కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని వివరించారు. దీంతో అసెంబ్లీ సెషన్ కు మౌకికంగా నిన్నే లైన్ క్లియర్ చేసిన గవర్నర్.. ఇవాళ అందుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు.