తెలంగాణ కేబినెట్(TS Cabinet)లో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు చివరిసారివి కావడంతో కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఆ సంస్థ ఉద్యోగులందరినీ ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించారు. అంతేగాక, హైదరాబాద్ మెట్రో రైలు కూడా పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమైన మార్గాలు ఇస్నాపూర్ – మియాపూర్ వరకు, ఎల్‌బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు, ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు పొడించాలని తెలిపారు. అంతేగాక, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్(Dasoju Sravan), కుర్రా సత్యనారాయణ(Kurra Satyanarayana) ప్రతిపాదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. కేబినెట్(TS Cabinet) సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ కేబినెట్ నిర్ణయాలను వివరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్(KTR) మాట్లాడుతూ.. ‘గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలలో తిరిగి తీర్మానం చేసి పంపుతాం. రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎస్టీల నుంచి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్‌లను గవర్నర్‌కు ప్రతిపాదిస్తూ క్యాబినెట్ తీర్మానించింది. వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టుకు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపాలని నిర్ణయం తీసుకుంది.