తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను ఆమోదించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఓకే చెప్పింది. ఈ అంశంపై కొంత కాలంగా కాస్తంత రభస నడుస్తోంది. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలను ఆమోదించకుండా టీటీడీ తమను కించపరుస్తోందని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే అంశంపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అంగీకరించకుంటే.. తిరుమలకు వచ్చి ఏవిషయం తేల్చుకుంటామన్నారు. కాగా తాజాగా వారి సిఫార్సు లేఖలను ఆమోదించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
రాష్ట్ర సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారం మాత్రమే లేఖలు స్వీకరిస్తారు. అంటే సోమవారం, మంగళవారం దర్శనాలకు అనుమతి ఉంటుంది. బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక ప్రవేశ ధర్శనాలకు(ఏరోజువి ఆరోజే) లేఖలను అనుమతిస్తామని వెల్లడించింది టీటీడీ. ఈ విధానం మార్చి 24 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.