Kishan Reddy – Revanth Reddy | పాలనపై చర్చకు వచ్చే దమ్ముందా? అన్న సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌కు కేంద్రంమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వీకరించారు. అసలు రేవంత్ ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఏం పాలన చేశారని చర్చించడానికి అంటూ చురకలంటించారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో అన్ని సంక్షేమ పథకాలకు తోక కోసి సున్నపు బొట్టు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో(Nizamabad) కిషన్ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) మూడు స్థానాలు గెలుస్తాం. సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరిస్తున్నా. హామీలు అమలు కు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధం. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదు. చర్చ కు రమ్మనడం హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలి సీఎం రేవంత్ స్పష్టం చెయ్యాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి బీజేపీ ని ఆదరించాలి. బీఆర్ఎస్(BRS) పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల్లో పసుపు బోర్డు(Turmeric Board) ప్రభావం ఉంటుంది.
కులగణనకు బీజేపీ(BJP) వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ లను స్వాగతిస్తాం. ముస్లిం లను బిసి జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తాం. బీజేపీ తో బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గతంలో అనేక సార్లు బీఆర్ఎస్(BRS) కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. జిల్లా అధ్యక్షుల నియామకాల ప్రక్రియ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక’’ అని Kishan Reddy స్పష్టం చేశారు.