ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక అప్‌డేట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే దీనిని చేపడతామని భరోసా ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగానే ఎస్సీ వర్గీకరణను తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రూ.2700 కోట్లతో రైతు రుణమాఫీ చేయడం జరిగిందని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు అమ్మేసి రూ.1700 కోట్లు సొమ్ము చేసుకుందని, పదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బీఆర్ఎ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
కానీ తమ ప్రభుత్వం అలా కాదని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ఆ ఉద్యోగాలకు ఎంపికైన వారికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. నియామక పత్రాలు అందించారని గుర్తు చేశారు. తెలంగాణలో 40 లక్షల మంది రైతులు 153 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించారని, పొల్యూషన్ నివారణకు ఎలక్ట్రికల్ బస్సు కొనుగోలు చేపట్టామని వివరించారు. దాంతో పాటుగా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని, అత్యధిక పరిశ్రమలు నిర్మిస్తున్నామని, ఈ నెల నుంచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని Uttam Kumar Reddy పేర్కొన్నారు.