Venkaiah Naidu suggestions for increasing Forming in country: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో రైతు నేస్తం ఫౌండేషన్, ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పురస్కారాల ప్రధానోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఉద్యాన శాస్త్రవేత్తలు, రైతులకు వెంకయ్యనాయుడు పురస్కారాలు ప్రదానం చేశారు.
అనంతరం, వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, నేల ఆరోగ్యంగా ఉంటేనే.. పంట ఉత్పత్తి బాగుంటుందని అన్నారు. కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలైనా.. ఒక్క వ్యవసాయ రంగమే నిలబడిందని గుర్తు చేసుకున్నారు. ఆ ఘనత సాధించిన రైతులకు జేజేలు పలకాలని సూచించారు. రైతులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. నగరాల్లోని ప్రజలు సైతం మిద్దెతోటలు పెంచే విధంగా అవగాహన కల్పించాలన్నారు. దీనికి ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు. నిపుణుల ద్వారా రైతులకు శిక్షణ ఇప్పిస్తే.. మరింత పంట దిగుబడి రావటంతో, నష్టాలు లేకుండా చూడవచ్చునని వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అభిప్రాయ పడ్డారు.