ఖమ్మం(Khammam) నగరంలోని లకారం చెరువు వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తు్న్న ఎన్టీఆర్ విగ్రహ(NTR statue) ఏర్పాటు తీవ్ర వివాదాస్పదమవుతోంది. విగ్రహ ఏర్పాటును విశ్వహిందూ పరిషత్ నేతలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఎన్టీఆర విగ్రహ((NTR statue)) ఏర్పాటు మీద తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కృష్ణుడి అవతారంలో కాకుండా ఆయన సహజసిద్ధమైన రూపంలో ఏర్పాటు చేస్తే మంచిదని వీహెచ్‌పీ నేతలు అంటున్నారు. ఈ మేరకు వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సహజసిద్ధమైన పంచె కట్టు, తలపాగతో తెలుగుతనం ఉట్టిపడే తేజస్సు నందమూరి సొంతమని, అలాంటిది ఆయనకు నెమలి పించం, పిల్లనగ్రోవి, నీలిరంగు తొలగించి, అటు కృష్ణుడు కాక.. ఇటు సహజ సిద్ధమైన రూపంకాకపోవడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్ గౌరవాన్ని పెంచాలనుకుంటున్నారా? లేక తగ్గించాలనుకుంటున్నారా అని వారు నిర్వాహకులను ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల కోసం తెలుగు ప్రజల అభిమాన నటుడైన ఎన్టీఆర్‌ను బలి చేయొద్దని ఆయన హెచ్చరించారు.