vikas raj clarification on Munugode Bypoll counting: మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు అత్యంత పారదర్శకంగా జరుగుతుంది రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగానే సాగుతోందనీ.. దీనిపై ఎటువంటి అనుమానాలకు తావు లేదని తేల్చి చెప్పారు. కౌంటింగ్ వద్ద ఆయా పార్టీలకు చెందిన పార్టీ ఏజెంట్లు ఉన్నారని గుర్తు చేశారు. వారి సంతకం తీసుకున్న తరువాతే తుది ఫలితాలు వెల్లడవుతాయని వివరించారు. 47 మంది అభ్యర్థులు ఉండటం వల్లే లెక్కింపులో ఆలస్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు. కాగా, లెక్కింపు పూర్తికాక ముందే ప్రతి రౌండ్ ఫలితాలను అధికారులే మీడియాకు లీక్ చేస్తున్నారంటూ మంత్రి జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రకటనలో ఎటువంటి తప్పు జరిగినా, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాగా నాలుగు రౌండ్ల లెక్కింపు ఫలితాలు త్వరత్వరగా వెల్లడించినా.. ఐదో రౌండ్ నుంచి ఎక్కువ సమయం పడుతుండటంతో.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.