లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జగ్గారెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో వరంగల్‌లో గులాబీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో ఆమె కనిపించలేదు. దీంతో ఆమె పార్టీని వీడుతారనే ప్రచారం సాగింది. ఇప్పుడు ఇదే ప్రచారం నిజమైంది. కాగా సుధారాణి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2002 నుంచి 2004 వరకు టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. 2010లో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర విభజన పరిణామాల అనంతరం 2016లో ఆమె టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, సుధారాణి టీడీపీలో కలిసి పనిచేశారు.