దేశంలోని అన్ని వ్యవస్థల్లో, అన్ని రంగాల్లో కుల వ్యవస్థ ఉందనేది అక్షర సత్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బుధవారం నుంచి ప్రారంభంకానున్న కులగణన అంశంపై చర్చించడానికి రాహుల్ గాంధీ.. మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కుల వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న కుల వివక్షపై ప్రధాని మోదీ మాట్లాడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కుల గణన(Caste Census)తో రాష్ట్రంలోని దళితులు, ఆదివాసీలు, మైనారీటీలకు భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని తెలిపారు. కుల గణనతో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలువనుందని అన్నారు. కులగణనలో పొరపాట్లను సరిచేసుకుంటూ ముందడుగు వేస్తామని చెప్పారు.
‘‘బీజేపీ నేతలు, ప్రధాని మోదీ(PM Modi) సైతం నేను దేశాన్ని విభజిస్తున్నానని ఆరోపిస్తున్నారు. దేశం గురించి, దేశంలోని పరిస్థితుల గురించి ఉన్న వాస్తవాలు చెప్తే విభజించడం అవుతుంది. ఈ కుల గణన ద్వారా దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, ఓబీసీ ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవచ్చు. దేశంలో ఎంతమంది నిరుపేదలున్నారనేది మనం తెలుసుకోవాలి. ఎంతమంది ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు న్యాయవ్యవస్థలో, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారనేది తెలుసుకోవాలి. ఏ వ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారనేది తెలుసుకోవాలి. ఇండియా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారనేది మనం తెలుసుకోవాలి. ప్రధానమంత్రి ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఎందుకు భయపడుతున్నారు’’ అని రాహుల్(Rahul Gandhi) ప్రశ్నించారు.