ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయి చివరకు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. పెద్దపల్లి(Peddapalli) జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయి తేజ అనే 25 ఏళ్ల యువకుడు బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. సాయి తేజ ప్రేమ వివాహం చేసుకుని గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డారు. వాటి ఊబిలో చిక్కుకుని రూ.10లక్షలకుపైగా అప్పులు చేశాడు.
Peddapalli | వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక.. ఇక మరణమే శరణ్యమనుకున్నాడు. మార్చి 18న గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు సాయి తేజను హుటాహుటిన కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం రాత్రి మరణించాడు. ప్రస్తుతం సాయి తేజ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మంథనికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.