వైఎస్సార్టీపీ(YSRTP)ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంపై చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. తన అనుచరులతో చర్చించిన తర్వాతే విలీనంపై తుది నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టంచేశారు. త్వరలోనే మీడియాకు అన్ని వివరాలను తెలియజేస్తానన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు. తన తండ్రి మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని సోనియాగాంధీ గౌరవిస్తున్నారు కాబట్టే వారితో చర్చలకు వెళ్లానని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్‌లో వైఎస్ పేరును చేర్చడం సోనియా(Sonia Gandhi)కు తెలియక జరిగిందన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కూడా సీబీఐ చార్జిషీట్ లో అబ్ స్కాండర్ గా ఆయన పేరును చేర్చారని… ఆ బాధ ఎలా ఉంటుందో తమకు తెలుసని వారు తనతో అన్నట్లు ఆమె చెప్పారు. వైఎస్ లేని లోటు తెలుస్తోందని రాహుల్ అన్నారని తెలిపారు. కేసీఆర్ అవినీతి పాలనను సాగనంపేందుకే సోనియాతో చర్చలు జరిపానని షర్మిల వెల్లడించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన కుమార్తె షర్మిల(YS Sharmila) ఆయనకు నివాళులర్పించారు. శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ కు చేరుకున్న షర్మిల తండ్రికి శ్రద్ధాంజలి ఘటించి కన్నీంటిపర్యంతమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. మరోవైపు అన్నాచెల్లెళ్లు ఏపీ సీఎం జగన్, షర్మిల మధ్య విభేదాలు మరోసారి బయటకువచ్చాయి. తండ్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎవరికి వారే వేరు వేరుగా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.