ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని, అప్పుల కుప్పగా మార్చారని విపక్షాలన్నీ మూకుమ్మడిగా విమర్శిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao) లోక్‌సభలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం విపక్షాల ఆరోపణలు నిజమేననే తీరులో వెల్లడైంది.
దీంతో షర్మిల(YS Sharmila) సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు. బంగారు తునకలాంటి ధనిక రాష్ట్రాన్ని.. తన ధన దాహానికి బలిచేసి.. అప్పు పుట్టనిదే, ఉన్న భూములు అమ్మనిదే రాష్ట్రం ముందుకు పోలేని దీనస్థితికి తెచ్చిండని విమర్శించారు. 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ లేదన్నారు. స్కాములతో నిధులన్ని స్వాహా చేసి.. స్కీములను “కాం” చేశారన్నారు. ఇంతకాలం దోచుకుతిన్నది చాలక ఎన్నికలకు మూడు నెలల ముందు పథకాలకు అప్పులు కావాలని కేంద్రం వద్ద కొత్త డ్రామాకు తెర లేపుతున్నడని ఆరోపించారు.