అకాల వర్షాలకు రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జనగామ జిల్లా బచ్చన్న పేట మండలంలో పంట నష్టాన్ని షర్మిల పరిశీలించారు. చేతికందే పంట నేల పాలయిందని రైతులు ఆమెకు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసారు. గత నెల 23న గాలిమోటర్లో వచ్చి పంట నష్టాన్ని చూసి ఎకరాకు రూ. 10 వేలు ఇస్తమన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. సీఎం హామీ మాటలకే పరిమితమైందని మండిపడ్డారు.
రైతులకు రూ. 5 వేలు రైతు బంధు ఇచ్చి ఆదుకుంటున్నామని గొప్పలు చెప్పుకునే సీఎం.. రైతుల పాలిట ద్రోహి అంటూ దుయ్యబట్టారు. మీరు ఇచ్చే పరిహారం పంట పెట్టుబడికి, నష్టానికి సరిపోదని.. దాదాపు 50 వేల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని.. 10 వేల మంది రైతులు బాధితులు గా ఉన్నారని.. గడిచిన 9 ఏళ్లలో పంట నష్ట పరిహారం అనే విధానాన్ని సీఎం కేసీఆర్ తొలగించారని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30 వేలు ఇవ్వాలని షర్మిల(YS Sharmila) డిమాండ్ చేసారు. రైతు బంధు కింద 5 వేలు ఇస్తూ… ఇన్ పుట్ సబ్సిడీ, ఎరువుల పైన సబ్సిడీ, విత్తనాల పైన సబ్సిడీ లేదని అన్నారు. రుణమాఫీ చేయకపోగా రూ.5 వేలు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నారని.. ఆ డబ్బులు కనీసం వడ్డీకి కూడా సరిపోవని అన్నారు. రైతులపై కనికరం లేని సీఎం.. పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేసారు.
Read Also: టీడీపీలో చేరికపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ
Follow us on: Google News, Koo, Twitter