ఎల్బీనగర్ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గిరిజన మహిళ లక్ష్మీ(Lakshmi)కి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) ఆదివారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆందోళనకారులపై లాఠీఛార్జీ చేశారు. అనంతరం వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. షర్మిలను హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్లో చిత్రహింసలకు గురైన మహిళా బాధితురాలను ఆమె పరామర్శించారు. బాధితురాలికి వెంటనే రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని.. లక్ష్మిపై థర్డ్ డిగ్రీ ఘటనపై వెంటనే విచారణ కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఇక్కడే ధర్నా చేస్తున్నానని వెల్లడించారు.
అర్ధరాత్రి మహిళ స్వేచ్చగా తిరిగినప్పుడే మనకు అసలైన స్వతంత్రం అని గాంధీజీ అన్నారని.. ఇప్పుడు మరి మనకు స్వాతంత్య్రం వచ్చినట్లా? రానట్లా? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి పూట మహిళ అని చూడకుండా స్వాతంత్య్రం వచ్చిన రోజు ఈ అరాచకం చేశారని మండిపడ్డారు. పోలీసులకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు.. ఇండియన్ పీనల్ కోడ్ అంటే గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల తీరు రౌడీలకు, రేపిస్టులకు తేడా లేదన్నారు. ఆగస్ట్ 15న పోలీసులకు మద్యం ఎక్కడ దొరికిందని ఆమె ప్రశ్నించారు.
ఎస్సై, కానిస్టేబుళ్లు బాగా తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. మద్యం తాగి గిరిజన మహిళపై దారుణంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లను మృగాలతో పోల్చినా తప్పు లేదన్నారు. అర్ధరాత్రి మహిళ పోలీసులు లేకుండా లక్ష్మిని ఎలా అదుపులోకి తీసుకుంటారని షర్మిల(YS Sharmila) మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు అంట.. ఎవరికి మీరు ఫ్రెండ్లీ పోలీసులు? అని నిలదీశారు. పెళ్లి ఉందని వేడుకున్నా వదలలేదని.. బిడ్డ పెళ్లి కోసం తెచ్చుకున్న రూ.3లక్షలు, ఒంటి మీద ఉన్న నగలు కాజేశారన్నారు. మీరు అసలు మనుషులేనా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత దారుణం జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు బహిరంగంగా స్పందించలేదని షర్మిల ప్రశ్నించారు.