వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గమై గజ్వేల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు లోటస్‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్ద భారీగా మోహరించారు. అయితే గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. గజ్వేల్ వస్తే అడ్డుకుంటామని ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. దీంతో ముందస్తుగానే షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో లోటస్‌పాండ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో నివాసం నుంచి బయటకు వచ్చిన షర్మిల పోలీసులకు హారతి ఇచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. తాను మాత్రం పర్యటన చేసి తీరుతానని తేల్చిచెప్పారు.
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో నేడు పర్యటనకు సిద్ధమయ్యారు. దళిత బందు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామాల్లో ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో పర్యటించి స్థానికులకు మద్దతు తెలపాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. లోటస్‌పాండ్ నివాసం నుంచి షర్మిల బయలుదేరనున్న నేపథ్యంలో పోలీసులు ఆమె ఇంటి వద్ద భారీగా మోహరించారు. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ షర్మిల ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ వెళ్తే అక్కడ కూడా ప్రజలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని భావిస్తున్న పోలీసులు షర్మిలను హౌస్ అరెస్ట్ చేశారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న దళితబంధు పథకం రెండో దశను జూలై 24న అమలుచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హుజూరాబాద్ మినహా ఎక్కడా కూడా దళితబంధు అందలేని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని పలువురు లబ్దిదారులు ఆందోళనకు దిగారు. దళితబందు పథకం అర్హులకు అందడం లేదని తీగుల్ గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు.