అమరజీవి దొడ్డి కొమరయ్యను విస్మరిస్తున్న పాలకులు

0
98

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను నేటి పాలకులు విస్మరిస్తున్నారని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(GMPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ విమర్శించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర GMPS ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం రవిందర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, దొరల దోపిడిపై జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య బలిదానం ఉన్నతమైనదన్నారు. ఆయన మరణంతో సాయుధ పోరాటంగా మారి నాటి దొరల పాలనను అంతం చేసేంతవరకు కొనసాగిందన్నారు. సాధారణ గొర్రెల కాపర్ల కుటుంబంలో జన్మించి బాంచెన్ దొరా అన్నోళ్లను బందూకులు పట్టించేలా చేసిండని కొనియాడారు. ఈ పోరాటం దేశంలో అనేక ఉద్యమాలకు దిక్సూచిగా ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా ఆ పోరాట స్ఫూర్తితో నడుపుతున్నామని అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

వర్ధంతి వేడుకలు అధికారికంగా జరపకుండా బహుజనులను కించపరుస్తున్నారని విమర్శించారు. ఆ వీరుడు చూపిన బాటలో పోరాట స్ఫూర్తితో గొర్రెల కాపరులు, ముఖ్యంగా నేటి యువతరం నడిచి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమాలలో భాగస్వాములు కావాలని కోరారు. అప్పుడే దొడ్డి కొమురయ్యకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎక్కలదేవి కొమురయ్య, బావని వెంకటేష్, మాసాని మల్లేష్, వడ్డెపల్లి పోచయ్య, సల్ల క్రిష్ణ, పెంజర్ల కనుకరాజు, గౌర్ల క్రిష్ణ, మైల జీతయ్య, గౌర్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.