తన లక్ష్యం కోసం ఉన్నతమైన ఐపిఎస్ ఉద్యోగాన్ని వదులుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఇక తన పని షురూ చేసినట్లే కనబడుతున్నది. ఇప్పటికే పలు టివి ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ తన లక్ష్యం ఏమిటి? ప్రయాణం ఎలాంటిది? మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు.. అన్నదానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాజాగా ట్విట్టర్ లోని తన వాల్ మీద పాడి కౌషిక్ రెడ్డి మీద స్ట్రాంగ్ పంచ్ ఇస్తూ పోస్టు చేశారు. పాడి కౌషిక్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో సిఎం కేసిఆర్ సమక్షంలో చేరుతున్న సమయంలో అగ్రవర్ణ నాయకులైన రెడ్డి, వెలమ నేతలను గారు, గీరు అని సంబోధించిన కౌషిక్ రెడ్డి మిగతా వర్గాల వారిని మాత్రం అగౌరవంగా సంబోధించాడు. దీంతో ఆయన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు దుమ్ము రేపుతున్నాయి. ఈ తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కౌషిక్ రెడ్డి తీరును గట్టిగా ఎండగడుతూ ట్వీట్ చేశారు. ప్రవీణ్ కుమార్ ట్వీట్ లింక్ కింద ఉంది చూడొచ్చు.
కౌశిక్ బ్రదర్, మీరు ఆధిపత్యకులాల నాయకులను ‘గారు’ అని గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజనరాజ్యం రావాలంటున్నరు. I am not against any particular caste, but we must stop this reckless framing. pic.twitter.com/jL3tOb6YIw
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 27, 2021
ఇదిలా ఉండగా గతంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నోరు పారేసుకున్నారు. రిజర్వేషన్ల వల్ల కొన్ని కులాల వాళ్లు తెలివిలేకపోయినా ఉన్నత ఉద్యోగాల్లో కులుకుతున్నారన్నది ఆయన కామెంట్స్ సారాంశం. అప్పుడు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తాను ఐపిఎస్ పోస్టులో ఉన్నా సరే… చల్లా ధర్మారెడ్డిని ఉతికి ఆరేశారు. రిజర్వేషన్లతో తెలివిలేని వారు ఉన్నత స్థానంలో ఉన్నట్లైతే… మరి అంబేడ్కర్ ఎవరు బై అని నిలదీశారు. అంతేకాదు.. నీలా మాట్లాడాలంటే మాకు సంస్కారం అడ్డం వస్తుందని మైండ్ బ్లోయింగ్ పంచ్ ఇచ్చారు. మొత్తానికి తన లైన్ ఏంటి అనేది ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడిస్తున్నారు.