సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి పిసిసి మార్పుపై తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. పిసిసి చీఫ్ రేసులో తాను కూడా ఉన్నానని గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తాను పిసిసి అయితే రాష్ట్రమంతా అంబులెన్స్ లు ఏర్పాటు చేసే వాణ్ణి అని అన్నారు.
తనకు కాకుండా తనకు ఇష్టం ఉన్న వ్యక్తి పిసిసి అయితే రాష్ట్రమంతా తిరుగుతానని, లేక తనకు ఇష్టం లేని వ్యక్తిని నియమిస్తే మాత్రం నియోజకవర్గానికి పరిమితం అవుతానని స్పష్టం చేశారు. ప్రజల సమస్య లకు ఎలాంటి మెడిసిన్ వేయాలో తనకు తెలుసని.. అందుకే అందుకే పిసిసి అడుగుతున్నానని చెప్పుకున్నారు జగ్గారెడ్డి.
తనకూ పిసిసి చీఫ్ అవకాశము ఇవ్వాలని రాహుల్, సోనియా గాంధీలను అడిగానని చెప్పుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ కి వెళ్లి పిసిసి ఇవ్వండి అని అడిగే పరిస్థితి లేదన్నారు. పిసిసి ఎవరు కావాలని ప్రజలు అడిగే పరిస్థితి లో లేరన్నారు. జనం కరోనా టెన్షన్ లో ఉన్నారని చెప్పారు.
అసలు పిసిసి చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్త పిసిసి చీఫ్ ని పెట్టి చేసేది ఏముందని ప్రశ్నించారు. అధిష్టానం పిసిసి చీఫ్ ని నియమిస్తే మేము ఆపేది కాదన్నారు. పిసిసి నియామకం జరిగితే… అందరి అభిప్రాయ సేకరణ చేసి చేపట్టాలన్నారు. అధిష్టానం పిసిసి గా ఎవరి పేరు నిర్ణయం చేసిన కట్టుబడి ఉంటామన్నారు.