తెలంగాణలో లాక్ డౌన్ ను మరో 10 రోజులపాటు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈనెల 30 తో పాత లాక్ డౌన్ ముగిసిపోనున్న తరుణంలో పది రోజులు అంటే జూన్ 9 వరకు కొత్త లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సమావేశమైన కేబినెట్ లో ఈ అంశం అత్యంత కీలకమైనది కావడంతో కూలంకషంగా చర్చించారు. ఇప్పటికే వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించిన ప్రభుత్వం మరో 10 రోజులపాటు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నది.
అయితే లాక్ డౌన్ సమయంలో వెసులుబాటు సమయం ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 వరకు ఉంటుండగా రేపటినుంచి దాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొడిగించాలని నిర్ణయించింది.
అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరడానికి సడలింపు సమయం ముగిసిన తర్వాత గంటసేపటి వరకు అవకాశం ఇస్తారు. అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటికి చేరుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినమైన లాక్ డౌన్ అమలు చేయాలని సిఎం కేసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది.
లాక్ డౌన్ మరో పదిరోజుల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని మంత్రి కేటిఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. వెసులుబాట్లను మధ్యాహ్నం ఒంటిగంట వరకు కల్పిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం కల్పించబోతున్నట్లు వివరించారు. గైడ్ లైన్స్ త్వరలోనే వెలువడతాయన్నారు.
కేటిఆర్ ట్వీట్ తాలూకు స్క్రీన్ షాట్ కింద ఉంది. చూడొచ్చు. ట్విట్టర్ లో కేటిఆర్ వాల్ మీద ఆ పోస్టును కూడా చూడొచ్చు.