Pakistan Bomb Blast | పాకిస్థాన్ లో మరోసారి బాంబు దాడి కలకలం రేపింది. పాక్ ప్రావిన్స్ బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా రైల్వేస్టేషన్లో(Quetta Railway Station) శనివారం బాంబు దాడి జరిగింది. స్టేషన్ బుకింగ్ ఆఫీస్ వద్ద జరిగిన ఈ పేలుడులో దాదాపు 21 మంది మరణించగా.. 46 మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన సహాయ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆధారాలను సేకరించిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్.. ఇది ఆత్మాహుతి దాడి కావచ్చు అని ప్రాధమిక అంచనా వేసింది.
Pakistan Bomb Blast | కాగా, క్వెట్టా రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9 గంటలకు పెషావర్ వెళ్లాల్సిన ఓ రైలు స్టేషన్ నుంచి బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు దాటికి ప్లాట్ ఫామ్ పైకప్పు దెబ్బ తిందని స్టేషన్ స్టాఫ్ వెల్లడించారు. రద్దీగా ఉండే సమయంలో పేలుడు జరగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటనను బలూచిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పోలీసులు, మహిళలు, చిన్నారులు, సాధారణ పౌరులు లక్ష్యంగా ఉగ్రదాడులు పెరిగాయని, బాధ్యులను విడిచిపెట్టబోమని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఘటనకు బాధ్యత వహించింది.