అగ్రరాజ్యం భారీ వర్షాలు, తుఫానులతో అల్లకల్లోలం అవుతోంది. ఎడారి మధ్యలో నిర్వహించే అతిపెద్ద పండుగ అయిన బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్(Burning Man Festival) కు చిక్కులు తప్పడం లేదు. ఒక రోజు రాత్రంతా వర్షం కురవడంతో ఎడారి అంతా బురదమయం అయిపోయింది. ఎవరూ అక్కడి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.
అమెరికాలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్(Burning Man Festival) నిర్వహించే నెవాడాలోని బ్లాక్ రాక్ ఎడారి వర్షం దెబ్బకు బురదమయం అయింది. దీంతో ఈ ఫెస్టివల్ జరుగుతున్న ప్రాంతమంతా అస్తవ్యస్తంగా ఉంది. ప్రతి ఏటా ఈ ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు నలుమూలల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఈ ఏడాది కూడా 70 వేల మంది ఈ ఫెస్టివల్ కు హాజరయ్యారు. ఆగస్టు 27న బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని హిల్లరీ హరికేన్ తాకింది. ఒక రాత్రి మొత్తం వర్షం కురవడంతో ఎడారి అంతా బురద మయమైంది.
ఎడారిలో ఫెస్టివల్ ను ఎంజాయ్ చేద్దామనుకుని వచ్చిన వారికి ఈ బురద చుక్కలు చూపిస్తోంది. వాహనాలు ఎటూ కదల్లేకుండా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముందుకు నడవడానికి పది అడుగులు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. బ్లాక్ రాక్ సిటీ ఉపరితలం ఎండే వరకు వాహనాలు ముందుకు వెళ్లడానికి అనుమతించమని ఇప్పటికే నిర్వాహకులు తెలిపారు. దీంతో సందర్శకులను అక్కడ ఏర్పాటు చేసిన ఆహారం, నీరు వాడుకుని ఎక్కడైనా పొడిగా వెచ్చగా ఉన్న ప్రాంతంలో తల దాచుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రాంతం ది బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఆధీనంలో ఉంది. మూడు నెలలుగా కురవాల్సిన వర్షం ఒక్కరోజు రాత్రిలోనే కురవడంతో సిటీ అంతా బ్లాక్ అయింది. దీంతో ఆ ప్రాంతానికి రాకపోకలు నిలిపివేశారు అధికారులు. కొంతమంది మాత్రం కాలినడకన అయినా సరే అక్కడి నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.