కోవిడ్(Coronavirus) మహమ్మారి సృష్టించిన విలయతాండవం నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇంతలోనే చైనా మరో భయానక ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కోవిడ్ పుట్టుకకు చైనానే కారణమని ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ డ్రాగన్ కంట్రీ మరో భయంకర వైరస్ కి ప్రాణం పోస్తున్నట్టు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా జాతికి చెందిన మరో వైరస్ పై చైనాలో ప్రయోగాలు జరుగుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వైరస్ వల్ల మరణాల రేటు వంద శాతం ఉంటుందని తెలుస్తోంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వైరస్ ప్రయోగాలను నిలిపివేయాలని హెచ్చరిస్తున్నారు.
కాగా, వూహాన్ లో జరిపిన ఓ అధ్యయనంతో కొత్త వైరస్ ప్రయోగం వ్యవహారం బయటకి వచ్చినట్టు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం.. సార్స్ కోవ్ – 2 (SarsCov-2) కి చెందిన జీఎక్స్ పీ2వి అనే సబ్ వేరియంట్ పై వూహాన్ ల్యాబ్స్ లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది 2017లో వచ్చిన జీఎక్స్ వేరియంట్ కి మ్యుటేషన్ అని తెలుస్తోంది. గతంలో ఈ జీఎక్స్ వేరియంట్ ను మలేషియాలోని పాంగోలిన్ జంతువుల్లో గుర్తించారు. కాగా చైనా శాస్త్రవేత్తలు జీఎక్స్ పీ2వి సబ్ వేరియంట్ ను ముందుగా ఎలుకలపై ప్రయోగించారు. వైరస్ సోకిన ఆ ఎలుకలు 8 రోజుల్లోనే మరణించినట్లు అధ్యయనంలో వెల్లడైంది.
జీఎక్స్ పీ2వి(GXP2V) వేరియంట్ ప్రభావానికి గురైన ఎలుకల ఊపిరితిత్తులు, కళ్ళు, ఎముకలు, మెదడు పూర్తిగా దెబ్బతిన్నాయని, బరువు తగ్గి చాలా బలహీనంగా మారాయని, రెండు మూడు రోజుల్లోనే వాటి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని అధ్యయనం తేల్చింది. ఒకవేళ మనుషులకు ఈ వైరస్ సోకితే ఎలుకలకు ఎదురైన ప్రభావమే మనుషులపై ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే చైనా ఈ ప్రయోగాన్ని విరమించాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.