China – US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్, పంది మాంసం, సోయా, గొడ్డు మాంసం వంటి కీలకమైన US వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై 15% వరకు అదనపు ట్యాక్స్ ని విధిస్తామని ప్రకటించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ సుంకాలు మార్చి 10 నుండి అమలులోకి రానున్నాయి. చైనా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను 20%కి పెంచాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆదేశాలిచ్చిన నేపథ్యంలో చైనా కౌంటర్ ఎటాక్ గా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, చైనా దిగుమతులపై అమెరికా కొత్తగా విధించిన ట్యాక్స్ లు నేటి నుంచే అమలులోకి వచ్చాయి.
కాగా, అమెరికాలో పండించే గోధుమ, మొక్కజొన్న, పత్తి, చికెన్ దిగుమతులపై అదనంగా 15% సుంకం విధించనున్నట్లు చైనా తెలిపింది. జొన్న, సోయాబీన్స్, పంది మాంసం, గొడ్డు మాంసం, సముద్ర ఆహారాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులపై సుంకం 10% పెరుగుతుంది. తాజాగా మంగళవారం బీజింగ్ మరో పది US సంస్థలను కూడా తాము నమ్మదగని సంస్థల జాబితాలో ఉంచింది. TCOM, లిమిటెడ్ పార్టనర్‌షిప్, స్టిక్ రడ్డర్ ఎంటర్‌ప్రైజెస్ LLC, టెలిడైన్ బ్రౌన్ ఇంజనీరింగ్, హంటింగ్టన్ ఇంగాల్స్ ఇండస్ట్రీస్, S3 ఏరోడిఫెన్స్, క్యూబిక్ కార్పొరేషన్, టెక్స్ట్ ఓర్, ACT1 ఫెడరల్, ఎక్సోవెరా, ప్లానెట్ మేనేజ్‌మెంట్ గ్రూప్ వంటి సంస్థలను ఈ జాబితాలో చేర్చింది.
చైనా(China) సంబంధిత దిగుమతి లేదా ఎగుమతి కార్యకలాపాలలో ఈ సంస్థలు పాల్గొనకుండా, అలాగే దేశంలో కొత్త పెట్టుబడులు పెట్టకుండా నిషేధించనుంది. ఈ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు చైనాలోకి ప్రవేశించకుండా నిషేధించబడతారని, వీరికి పని అనుమతులు, చైనా సందర్శకుల, నివాస అనుమతులు కూడా రద్దు చేయబడతాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.