ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మోయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das) కి కోర్టులో నిరాశ ఎదురైంది. బంగ్లాదేశ్ లో దేశద్రోహం కేసులో అరెస్టైన ఆయనకు చిట్టగాంగ్ కోర్టు బెయిల్ నిరాకరించింది. తీవ్రమైన అభియోగాల కారణంగా కృష్ణదాస్ కి బెయిల్ ఇవ్వలేమని జడ్జి వెల్లడించారు. దీంతో బెయిల్ కోసం హైకోర్టుకు వెళదామని కృష్ణదాస్ తరపు న్యాయవాదులు తెలిపారు.
బంగ్లాదేశ్(Bangladesh) జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణల నేపథ్యంలో గతేడాది నవంబర్ 25వ తేదీన చిన్మోయ్ కృష్ణదాస్ ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆయన అరెస్టుపై యావత్ హిందూ సమాజం భగ్గుమంది. బంగ్లాదేశ్ లో మైనారిటీ హక్కులపై ఆందోళన వ్యక్తం అవడంతో స్పందించిన భారత సర్కార్.. హిందువులు సహా మైనారిటీల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వానికి సూచన చేసింది.
ఇదే విషయాన్ని భారత విదేశాంగ మంత్రి బంగ్లాదేశ్ వెళ్లి అక్కడి తాత్కాలిక ప్రభుత్వంతో చర్చించారు. మరోవైపు చిన్మోయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das) అరెస్టును ఇండియాలోని హిందువులు తీవ్రంగా ఖండించారు. ఆయనని విడుదల చేయాలంటూ హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన బెయిల్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్(Chittagong) మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టులో 30 నిమిషాలపాటు చిన్మోయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి ఆయనకు బెయిల్ ఇవ్వలేమని జడ్జి తేల్చి చెప్పారు. సుప్రీం కోర్టుకి చెందిన 11 మంది న్యాయవాదులు ఆయన తరుపున పని చేస్తున్నప్పటికీ బెయిల్ లభించలేదు. తాజా తీర్పు నేపథ్యంలో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు కృష్ణదాస్ తరపు న్యాయవాదులు వెల్లడించారు.