అమెరికా వాణిజ్య విధానంలో బుధవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలనాత్మక మార్పును చేశారు. అప్పటికి కొన్ని గంటల ముందు అనేక దేశాలపై విధించిన దిగుమతి పన్నులను 90 రోజుల పాటు నిలిపివేస్తూనే… చైనాతో(China) తమ వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. ఈ చర్యలు వాల్ స్ట్రీట్ లో బలంగా స్టాక్ మార్కెట్ ర్యాలీకి దారితీశాయి. అయితే డొనాల్డ్ ఏమి సాధించడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం వ్యాపారులు, పెట్టుబడిదారులు, అమెరికా వాణిజ్య భాగస్వాములను మాత్రం ఆందోళనకి గురి చేస్తోంది.
ట్రంప్(Donald Trump) గత వారం ప్రకటించిన ప్రపంచవ్యాప్త సుంకాలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో నాలుగు రోజుల పాటు వ్యాపారాలను స్తంభింపజేసి, అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి పడిపోతాయనే భయాలను రేకెత్తించిన తర్వాత ఆయన ఈ యు-టర్న్ తీసుకున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ ఆకస్మిక విధాన మార్పును ఒక గొప్ప చర్చల వ్యూహంలో భాగం అని చెప్పే ప్రయత్నించారు. కానీ విశ్లేషకులు మాత్రం అధ్యక్షుడు దిగుమతి పన్నులను, సుంకాలను, తొందరపాటుగా ఉపయోగించడం వల్ల భారీ ఆర్థిక నష్టం సంభవిస్తుందనే భయాలకు, మార్కెట్ ఒత్తిడికి లొంగిపోయినట్లు భావిస్తున్నారు.
ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు దాదాపు ప్రతి దేశంపై సుంకాలు విధించే ప్రణాళికలను ప్రకటించారు. ఇది ప్రపంచ వాణిజ్య వ్యవస్థను దెబ్బతీసింది. కొత్త సుంకాలలో మొదట చాలా దేశాల నుండి దిగుమతులపై విధించిన 10% బేస్ లైన్ పన్ను గత శనివారం అమల్లోకి వచ్చింది. ఈ అన్యాయమైన వాణిజ్య పద్ధతులు.. US వాణిజ్య లోటును భర్తీ చేయడానికే అని ఆరోపించిన దేశాలపై మరింత పన్ను భారాన్ని వేస్తూ ఆయన బుధవారం మరో ప్రకటన చేశారు. కానీ కొన్ని గంటల్లోనే ఆ సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ గడువు ఆయా దేశాలు తనతో, అమెరికా వాణిజ్య బృందంతో చర్చలు జరపడానికి అవకాశం ఇస్తుందని అన్నారు. కాగా, ఆయన చేసిన ఉపసంహరణకు ఒక మెలిక కూడా ఉంది. చైనా దిగుమతులపై మాత్రం సుంకాన్ని 125%కి పెంచుతూ సంచలన ప్రకటన చేశారు. యునైటెడ్ స్టేట్స్ పై ప్రతీకార సుంకాలను ప్రకటించినందుకు బీజింగ్ పై కౌంటర్ ఎటాక్ గా దీనిని అభివర్ణిస్తున్నారు.