IBM to lay off 3,900 employees as it misses annual cash target: ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి.గ్లోబల్ టెక్ దిగ్గజం IBM ఏకంగా 3,900 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్టు ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఇది కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,60,000 ఉద్యోగుల్లో 1.5 శాతానికి సమానం. ఖర్చుల నియంత్రణ, మూలధన నిధుల కొరత కారణంగా ఈ తొలగింపుల నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఇటీవల కంపెనీ సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్ సేవల్లో డిమాండ్ నెమ్మదించిన కారణంగా ఆదాయం తగ్గిందని వివరించింది. అయితే, తొలగింపులు జరిగినప్పటికీ కంపెనీ నిర్దేశిత విభాగాల్లో నియామకాలాను కొనసాగిస్తామని ఐబీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ అన్నారు. పరిశ్రమలో ఇతర కంపెనీల తరహాలో కాఉండా తాము గత రెండు, రెండున్నరేళ్ల కాలంలో డిజిటలైజేషన్, ఏఐ ఆటోమేషన్ విభాగాల్లో అత్యధికంగా నియామకాలు చేపట్టామని, దాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఇది రానున్న రోజుల్లో కంపెనీ సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఆర్థిక మాంద్యం, ఖర్చుల నియంత్రణ కారణంగా గత కొన్నాళ్ల నుంచి ఐటీ రంగంలో భారీగా తొలగింపులు జరుగుతున్నాయి. ఇటీవలే మైక్రోసాఫ్ట్, గూగుల్ సైతం 10 వేల కంటే ఎక్కువ మందిని ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే.