కోవిడ్ 19 తర్వాత డ్రాగన్ కంట్రీలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. చైనాలో హ్యూమన్ మెటా న్యుమో వైరస్ (HMPV) అనే వ్యాధి వ్యాప్తి భయాందోళనకు గురి చేస్తోంది. ఈ HMPV Virus కరోనా వ్యాధిలా అంటువ్యాధి, ప్రాణాంతకం అని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆసుపత్రుల ముందు రోగులు క్యూ కడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
HMPV Virus లక్షణాలు:
HMPV వైరస్ వలన శ్వాసకోశ సమస్యలు ఎదురవుతున్నాయి. శ్వాస వ్యవస్థ పైనే వైరస్ దాడి చేస్తుంది. స్వల్ప స్థాయి నుంచి తీవ్ర స్థాయి ఇన్ఫెక్షన్ గా మారే ఛాన్స్ ఉంటుంది. తుమ్ములు, దగ్గుతో వైరస్ వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్య, ఆయాసం ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి తొందరగా వైరస్ సోకుతుంది. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం, మాస్క్ ధరించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు.
వ్యాక్సిన్ లేదు…
HMPV వైరస్ నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు, మరిన్ని సమస్యలు తలెత్తకుండా మాత్రమే వైద్యులు వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
భారత్ అలర్ట్…
చైనాలో HMPV వైరస్ విజృంభిస్తుండటంతో భారత దేశం అప్రమత్తమైంది. దేశంలో నమోదవుతున్న సీజనల్ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన కేసులను కేంద్ర ఆరోగ్యశాఖ పర్యవేక్షిస్తోంది. వ్యాధిపై అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. శ్వాసకోశ సమస్యలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.