Course on Social Media | స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో సోషల్ మీడియా ఒక భాగంగా మారిపోయింది. తమ ఫీలింగ్స్ ని వ్యక్తపరచడానికి, ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకోవడానికి, టైం పాస్ కి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లను వాడేస్తున్నారు. ఇంటర్నెట్ లేకపోతే రోజు గడవదేమో అనే స్థాయికి యువత చేరిపోయారు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. కొంతమంది మాత్రం వీటిని కాలక్షేపానికే కాదు.. తమకున్న పాపులారిటీ, ఫాలోయింగ్ ని సంపాదనకు మార్గంగా మార్చేసుకున్నారు కూడా. వీళ్లనే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివాళ్లు 6.4కోట్ల మంది ఉన్నారట. ఫోర్బ్స్ అధ్యయనం ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరు ఇన్ఫ్లుయెన్సర్ కావాలనుకుంటున్నారు.
రాబోయే రోజుల్లో వీళ్లు సెలెబ్రిటీలని మించి దూసుకెళ్లే అవకాశముందట. మరి అంతటి విస్తృతమైన పరిధి ఉన్న ఈ సబ్జెక్టుని ఓ క్రమపద్ధతిలో బోధించే కోర్సు లేకపోతే ఎలా అనుకుంది ఐర్లాండ్(Ireland) లోని సౌత్ ఈస్ట్ టెక్నికల్ యూనివర్సిటీ(South East Technological University). ఈ ఏడాదే.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ కంటెంట్ క్రియేషన్ అండ్ సోషల్ మీడియా అనే ఒక సరికొత్త కోర్సును(Course on Social Media) ప్రారంభించింది. ప్రపంచంలోనే ఈ తరహాలో ఇదే మొదటిది. ఇందులో ఫాలోయర్లను ఎలా ఆకట్టుకోవాలి? ఎలాంటి కంటెంట్ పెట్టాలి? ఏమేం ఫొటోలు అప్లోడ్ చేయాలి? కెమెరా వాడే విధానమేంటి? మార్కెటింగ్ ఎలా చేయాలి? ఇలాంటివన్నీ నేర్పిస్తారట. ఇంకెందుకు ఆలస్యం మరి.. ఆ కోర్సు తీసేసుకుని సోషల్ మీడియాని దున్నేయండి.