చైనా(China)లో భారీ భూకంపం సంభవించింది. పింగ్ యువాన్ కౌంటీలో సుమారు 120కి పైగా భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్సులోని పింగ్ యువాన్ కౌంటీలో ఆదివారం ఉదయం 2.33 గంటలకు భూమి కంపించిది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. డెజౌ నగరానికి 26 కీలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
ఒక్క సారిగా భూమి కంపించడంతో ప్రజలు ఒక్క సారిగా భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపానికి రైల్వే ట్రాక్ లు డ్యామేజ్ అయ్యాయి. భూకంపం నేపథ్యంలో ప్రావిన్సులోని 60కి పైగా రైళ్లను రద్దు చేసినట్టు బీజింగ్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ దశాబ్దంలో ఈ ప్రావిన్స్‌లో సంభవించిన ఇదే అతిపెద్ద భూంకపమని చెప్పారు. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అయితే రోడ్లపై శిథిలాలు చెల్లాచెదురుగా పడటంలో వాటి కింద కొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కోసం సహాయక బృందాలను పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో చైనా(China) ప్రభుత్వం అక్కడ ‘లెవెల్-ఫోర్’ఎమర్జెన్సీ ప్రకటించింది. జనావాసాలు లేని పాత భవనాలు మాత్రమే కుప్పకూలినట్టు తేలింది. ప్రభావిత ప్రాంతాలని వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
మరోవైపు శనివారం రాత్రి అఫ్గానిస్థాన్‌లో కూడా భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అఫ్గానిస్థాన్‌తోపాటు పాకిస్థాన్, జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో 181 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. అయితే దీని ప్రభావంతో ఢిల్లీ ప్రాంతంలో కూడా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.