రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్(Bangladesh) పై మరో పిడుగు పడింది. ఆ దేశాన్ని వరదలు చుట్టుముట్టాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు, నదులను తలపిస్తున్నాయి. లక్షల మందిపై వరద ప్రభావం పడగా… పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. వరద ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు త్రిపురకి తూర్పున ఉన్న బంగ్లాదేశ్(Bangladesh) సరిహద్దు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదల కారణంగా రోడ్డులు బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా కి అంతరాయం ఏర్పడటంతో చాలా ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. దాదాపు 50 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. లక్షల మంది వరదల్లో చిక్కుకుపోగా… పదుల సంఖ్యలో మరణించారు. ఐదు నదులు కట్టలు తెగి పొంగిపొర్లుతున్నాయి. దీనివల్ల 11 జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. నదుల్లో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. వేల సంఖ్యలో ఇళ్లు నీట మునిగిపోయాయి.
మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ బంగ్లాదేశ్లో ఈ తరహాలో వరదలు ముంచెత్తలేదు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ప్రభుత్వం 3,176 షెల్టర్ ఏర్పాటు చేసి 639 వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.