Nobel Prize 2023 | కొవిడ్-19 వైరస్ పై పోరు కోసం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో(Katalin Kariko), డ్రూ వెయిస్మన్(Drew Weissman) లను ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. కరోనా వైరస్ కు వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి వీరిద్దరి పరిశోధనలు దోహదపడ్డాయని అవార్డు ఎంపిక కమిటీ ప్రశంసించింది. కాటలిన్ స్వస్థలం హంగరీ కాగా, అమెరికాలో స్థిరపడ్డారు. వైద్యశాస్త్రంలో నోబెల్ కు ఎంపికైన 13వ మహిళగా ఆమె గుర్తింపు సాధించారు. అమెరికన్ శాస్త్రవేత్త వెయిస్మన్ తో కలసి ఆమె సాగించిన పరిశోధనల వల్ల ఎంఆర్ఎన్ఏ టీకా మన రోగనిరోధక వ్యవస్థతో చర్యలు జరిపే తీరుపై సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎంఆర్ఎన్ఏ అంటే..?
సంప్రదాయ టీకాల తయారీ విధానంలో.. లక్షిత వైరస్లలు లేదా అందులోని భాగాలను భారీగా వృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని శుద్ధిచేసి, తదుపరి దశల్లో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో సజీవ లేదా బలహీనపరచిన వైరస్లలను శరీరంలోకి చొప్పించాల్సి ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ ఆర్ఎస్ఏ) విధానం ఇందుకు పూర్తి భిన్నమైంది. ఇందులో తాత్కాలిక జన్యు సంకేతం ఉంటుంది. లక్షిత వైరస్లో ని ఎంపిక చేసిన భాగాన్ని ఉత్పత్తి చేయాలంటూ మన కణాలకు ఆదేశాలు అందులో ఉంటాయి. దాన్ని మన కణాలు రీడ్ చేసి.. ఆ ప్రొటీన్ను తయారుచేస్తాయి. అంటే.. మన శరీరమే ఒక మినీ టీకా కర్మాగారంగా మారిపోతుంది. అలా ఉత్పత్తయిన ప్రొటీన్ ఆధారంగా మన రోగనిరోధక వ్యవస్థ స్పందించి.. సంబంధిత ప్రొటీన్లను అడ్డుకునే యాంటీబాడీలు, ఇతర ప్రత్యేక కణాలను తయారుచేస్తుంది.