మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం జరిగింది. ఇప్పటికే భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యికి చేరింది. కూలిపోయిన వందలాది భవనాల శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఒక ప్రకటనలో 1,002 మంది చనిపోయినట్లు, మరో 2,376 మంది గాయపడ్డారని, మరో 30 మంది గల్లంతయ్యారని తెలిపింది. వివరణాత్మక గణాంకాలు ఇంకా సేకరించబడుతున్నాయి అని పేర్కొంటూ.. మృతుల, క్షతగాత్రుల సంఖ్యల ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆ ప్రకటన సూచించింది.
కాగా మయన్మార్(Myanmar) లో శుక్రవారం మధ్యాహ్నం భూకంపం(Earthquake) మండలేకు సమీపంలో కేంద్రంగా సంభవించింది. తరువాత 6.4 తీవ్రతతో కూడిన బలమైన భూకంపాలు సంభవించాయి. దీని ఫలితంగా అనేక ప్రాంతాలలో భవనాలు నేలమట్టమయ్యాయి. రోడ్లు స్తంభించిపోయాయి. వంతెనలు కూలిపోయాయి, ఆనకట్టలు తెగిపోయాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసం అవడంతో సహాయక చర్యలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
థాయిలాండ్ లోనూ హడలెత్తించిన ఎర్త్ క్వేక్…
మరోవైపు మయన్మార్ పొరుగున ఉన్న థాయిలాండ్(Thailand) లోనూ భూకంపం గ్రేటర్ బ్యాంకాక్ ప్రాంతాన్ని సైతం కదిలించింది. ఇక్కడ దాదాపు 17 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలామంది ఎత్తైన భవనాలలో నివసిస్తున్నారు. భూకంపం రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకి పరుగులు పెట్టారు.
బ్యాంకాక్(Bangkok) నగర అధికారులు ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారని, 26 మంది గాయపడ్డారని, 47 మంది ఇంకా కనిపించలేదని తెలిపారు. వీరిలో ఎక్కువ మంది రాజధానిలోని ప్రముఖ చతుచక్ మార్కెట్ సమీపంలోని నిర్మాణ స్థలంలో ఉన్నవారేనని పేర్కొన్నారు. భూకంపం సంభవించినప్పుడు థాయ్ ప్రభుత్వం కోసం చైనా సంస్థ నిర్మిస్తున్న 33 అంతస్తుల ఎత్తైన భవనం ఊగిసలాడింది. పై అంతస్తులోని స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీరు జలపాతంలా కిందికి జారాయి. కాసేపటి ఆ భవనం పేకమేడలా నేలపై కూలిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనతో కేకలు పెడుతూ సంఘటన స్థలం నుండి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.