Pakistan Court Gives Sensational Judgement in Rape Case: లైంగిక దాడి కేసులో పాకిస్తాన్ కోర్టు అనూహ్య తీర్పునిచ్చింది. న్యాయస్థానం వెల్లడించిన ఈ తీర్పు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. రేప్ విక్టిమ్ ని పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో నేరస్థుడిని విడుదల చేసింది. ఈ వ్యవహారం పాకిస్థాన్లోనే కాదు పలు దేశాల్లోనూ చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే..
ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని బునెర్ జిల్లాలో రేప్ కేసులో దవ్లాత్ ఖాన్ అనే వ్యక్తికి కింది స్థాయి కోర్టు ఉరి శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ నేరస్థుడు పెషావర్ కోర్టును ఆశ్రయించగా.. బయట జరిగిన ఒప్పందం మేరకు కోర్టు నిందితుడిని విడుదల చేసేందుకు అంగీకరించింది. రేపిస్టు, బాధితురాలు ఒకే కుటుంబానికి చెందిన వారని పేర్కొంది. ఇంతకీ ఆ ఒప్పందం ఏంటో కాదు. బాధితురాలిని పెళ్లి చేసుకోవడానికి రేపిస్ట్ ఒప్పుకోవడమే. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం తెలిపింది. స్త్రీలను తరచూ ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్న పాకిస్థాన్‌లో లైంగికదాడి కేసులలో విచారణ ఇలాగే ఉంటుందని పలువురు పెదవి విరుస్తున్నారు.