పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా నిర్దారించింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయాలు జరిమానా విదించింది. రూ. లక్ష జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నట్టు పేర్కొంది.
అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్ల పాటు అనర్హత వేటు వేసింది. ఇమ్రాన్ పై నమోదైన అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో సెక్షన్ 174 ప్రకారం ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విదేశీ ప్రభుత్వ అధికారులు, వివిధ దేశాల అధినేతలు ప్రముఖులు, పార్లమెంటేరియన్లు, అధికారులకు ఇచ్చే బహుమతులను భద్రపరచే శాఖను తోషాఖానా అంటారు. ఇది కేబినెట్ డివిజన్ నియంత్రణలో పనిచేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో తనకు వచ్చిన బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. బహుమతుల విషయంలో ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ తెలిపింది. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పై అనర్హత వేటు వేస్తున్నట్టు వెల్లడించింది. అప్పట్లో ఈ ఘటన పాక్ లో సంచలనం రేపింది.
ఈ తీర్పు వెలువడిన కాసేపటికే ఇమ్రాన్ ను లాహోర్ లో అరెస్ట్ చేసినట్లు ఆయన నేతృత్వంలోని పార్టీ పీటీఐ ట్వీట్ చేసింది. అనర్హత వేటు కూడా పడడంతో త్వరలో జరిగే జాతీయ ఎన్నికల్లో ఇమ్రాన్ పోటీ చేయడం సాధ్యం కాకపోవచ్చని పాకిస్తాన్ రాజకీయ వ్యవహారాల నిపుణులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు తీర్పుపై ఇమ్రాన్ అప్పీల్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీంతో మరో 90 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.