ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హిందువుల(Hindus)పై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులు సహా మైనారిటీల దుస్థితి తీవ్ర దయనీయంగా ఉంది. రోడ్లపైకి రావాలంటేనే భయపడేలా ఉంది. బయటకు వస్తే ఇంటికి తిరిగి వెళ్తామా అన్న ఆందోళనలు కలిగిస్తున్నాయి అక్కడ జరుగుతున్న దాడులు. అయితే ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడులు.. అమెరికా ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ఒకరైన ట్రంప్(Trump).. ఈ విషయాన్ని లేవనెత్తారు. దీపావళి పండగ సందర్భంగా తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ట్రంప్. అనంతరం హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ కూడా అమెరికా సహా పలు ఇతర దేశాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా అధ్యక్షుడు బైడెన్ కానీ, డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్ కానీ పట్టించుకోలేదని వారు మండిపడ్డారు.
‘‘బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువులు సహా మిగిలిన మైనారిటీలపై అనాగరిక రీతిలో దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అల్లరి మూకలు హిందువుల ఇళ్లు, దుకాణాలను దోపిడీ చేస్తున్నాయి. దీంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నేను(Trump) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను బైడెన్(Joe Biden), కమలా హారిస్‌లు(Kamala Harris) ఇద్దరూ విస్మరించారు. మేము అధికారంలోకి వస్తే రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక అజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తాం. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడతాం. నా పరిపాలనతో భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేస్తాం. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని నేను నమ్ముతున్నాను’’ అని బైడెన్ తన పోస్ట్‌లో రాశారు.