అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Trump) మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ఆర్డర్స్ పై సంతకం చేసి ఉత్తర్వులు జారీచేశారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే వలసదారులపై కఠిన నిర్ణయం తీసుకుంది ట్రంప్ ప్రభుత్వం. అదేవిధంగా ప్రభుత్వం వ్యయ భారం తగ్గించుకునేందుకు ఇటీవల విద్యాశాఖలో భారీగా కోత విధించిన విషయం తెలిసిందే.
డోనాల్డ్ ట్రంప్ పాఠశాల విద్యార్థులతో వైట్ హౌస్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యాశాఖ నుండి ప్రభుత్వానికి ఎలాంటి లాభం జరగట్లేదని తెలిపారు. అందుకే విద్యాశాఖను మూసివేస్తునట్లు ప్రకటించారు. దీనిని అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత శాఖ అధికారులను రాష్ట్రాలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను విద్యార్థులు ఇబ్బందులు పడకుండా కొనసాగిస్తామని ట్రంప్ వెల్లడించారు.
అయితే, ఈ చర్యను డెమోక్రట్లు తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ తీసుకున్న అత్యంత విధ్వంసకర, వినాశకరమైన చర్యల్లో ఇది ఒకటిగా వారు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి లిండా స్పందిస్తూ.. ఈ నిర్ణయం సరైనదే అని అన్నారు. అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను తొలగించామని పేర్కొన్నారు. తొలగించిన వారిని రాష్ట్రాలకు అప్పగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. ట్రంప్(Trump) అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే నాటికి 4,100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 600 స్వచ్చందంగా పదవి విరమణ నిర్ణయం తీసుకున్నారు.