జీతం చెల్లించడంలేదని ఓ అంగరక్షకుడు ఏకంగా మంత్రినే చంపిన దారుణ ఘటన ఉగాండా(Uganda)లో జరిగింది. కార్మికశాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఒకెల్లో ఎంగోలా వద్ద విల్సన్ సబిజిత్ అనే వ్యక్తి సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నెలరోజుల క్రితమే సబిజిత్ మంత్రి దగ్గర సెక్యూరిటీగా చేరాడు. వేతనం చెల్లించకపోవడంతోనే ఆయనను కాల్చి అనంతరం తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. సబిజిత్ ఆత్మహత్య చేసుకునే ముందు గాల్లోకి కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ కాల్పుల ఘటనలో మంత్రి సహాయకుడు రొనాల్డో ఒటిమ్ తో పాటు మరికొందరు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేవలం జీతం చెల్లించకపోవడంతోనే మంత్రిపై కాల్పులు జరిపాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.