పిల్లలపై లింగమార్పిడి ప్రక్రియలు చేయడాన్ని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk) తీవ్రంగా ఖండించారు. దీనిని ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించకూడదన్నారు. దీని వల్లే తాను తన కుమారుడిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు లింగమార్పిడి చేసుకుని ‘ఆమె’గా మారడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి మరణానికి ‘వోక్‌మైండ్ వైరస్’ కారణమని, దాని వల్లే తన కుమారుడు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నన్ను మభ్యపెట్టి నా కుమారుడి లింగమార్పిడికి నాతోనే సంతకం చేయించారు. అప్పుడు ప్రపంచమంతా కరోనాతో బాధపడుతోంది. దాంతో నా మైండ్ అంతా గందరగోళంగా ఉండేది. ఆ సమయంలోనే నా కుమారుడి లింగమార్పిడి విషయాన్ని నా దగ్గరకు తీసుకొచ్చారు. లింగమార్పిడి చేయించకపోతే అతడు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని చెప్పారు. ముందునుంచి అబద్దమే చెప్పారు. ఇదంతా దుర్మార్గం. దీనిని ప్రోత్సహిస్తున్న వారిని జైలుకు పంపాలి’’ అని మస్క్ మండిపడ్డారు. సామాజిక సమస్యలపై త్వరగా ఆకర్షితులై అతిగా స్పందించడం అనే ఉద్దేశంతో ఆయన ‘వోక్‌మైండ్ వైరస్’ అనే పదాన్ని ఉపయోగించారు మస్క్(Elon Musk).